: అనవసర మనోగతాన్ని తుడిపేయవచ్చు!
మన మనసులో కొన్ని కొన్ని సంఘటనలు అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. వాటిని మనం ఎన్నటికీ మరువలేం. ఇలాంటి మనం మరువలేని చేదు జ్ఞాపకాలను చక్కగా చెరిపేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని చేదు సంఘటనల వల్ల మనిషి మానసికంగా కుంగుబాటుకు గురవుతారు. ఇలాంటి వారికి వారి మనసులోని చేదు సంఘటనల తాలూకు జ్ఞాపకాలను చెరిపేయడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనల్లో మనసులోని బాధాకరమైన సన్నివేశాల తాలూకు జ్ఞాపకాలను చెరిపివేయడం సాధ్యమేనని తేలింది. కొన్ని సంఘటనల తాలూకు జ్ఞాపకాల వల్ల అంతులేని మానసిక వేదనతో కుంగుబాటుకు గురయ్యేవారికి, పెను ఉత్పాతం అనంతరం అపరిమితమైన ఒత్తిడికి లోనయ్యేవారికి ఇది నిజంగా శుభవార్తేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడులోని మిగిలిన జ్ఞాపకాలేవీ చెదిరిపోకుండా కేవలం అనవసరం అనుకున్న వాటిని మాత్రమే చెరిపేయవచ్చని, ఎలుకలపై తాము నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం స్పష్టమైందని, ఇదే విధానాన్ని మనుషులకు కూడా వర్తింపచేయవచ్చని, ఈ దిశగా మరింత పకడ్బందీ వ్యూహరచన చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, కొందరు కొన్ని రకాల మాదకద్రవ్యాలకు బానిసలై మెల్లమెల్లగా కోలుకుంటున్న వారికి వాటిని మళ్లీ తీసుకోవాలన్న ధ్యాస నుండి తప్పించడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుందని, ఆ మాదకద్రవ్యాలను మళ్లీ తీసుకోవాలన్న బలమైన కోరిక వల్ల విపరీతమైన సంఘర్షణకు గురయ్యేవారికి ఈ పరిశోధన ఒక ఆశాకిరణంగా చెప్పవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.