: మీ మెసేజ్‌తో మీ ఫ్యూచర్ చెప్పవచ్చు!
ఇప్పుడంతా మెసేజ్‌లమయం... ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్ చకచకలాడుతుంటుంది. మనం మనకు కావలసిన వారికి మన మనసులోని మాటలను వ్యక్తపరచడంలో మెసేజీలు ప్రత్యేకమైనవి. అయితే, మనం పంపే మెసేజ్‌లు మన అంతరంగం గురించి ఇట్టే చెప్పేస్తాయట... అంటే మెసేజ్‌లో మన మనస్తత్వం చక్కగా తెలిసిపోవడమేకాదు... మనం భవిష్యత్తులో ఎలాంటి సమస్యల్లో పడతామనే విషయాన్ని కూడా అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు యువత పంపే ఎస్సెమ్మెస్‌లపై అధ్యయనం చేసి వాటి ద్వారా వారు భవిష్యత్తులో తప్పుదారిలో నడిచే అవకాశం ఉందా? అనే విషయాన్ని అంచనా వేయవచ్చని చెబుతున్నారు. యువత కొన్నిరకాల వ్యతిరేక అభిప్రాయాలను ఎస్సెమ్మెస్‌ల రూపంలో పంపుతుంటారు. అయితే ఇలాంటి సందేశాలను ఎంత వెంటవెంటనే పంపారనే విషయాన్ని బట్టి వారు ముందుముందు ఎలాంటి పరిస్థితుల్లో పడబోతున్నారనే విషయాన్ని ఊహించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సామాజిక వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు, ఇతరాల గురించి యువత పంపే ఎస్సెమ్మెస్‌లు వారి భవిష్యత్తును మన ముందుంచుతాయని ఈ పరిశోధకుల బృందానికి సారధ్యం వహించిన డాక్టర్ శామ్యూల్ ఎహ్రెన్రీచ్ చెబుతున్నారు.
టీనేజ్ లో ఉండేవారు రోజుకు సగటున 60 నుండి 100 ఎస్సెమ్మెస్‌ల దాకా పంపగలుగుతారని, వీటిలో వారు తాము పంపిన అన్ని మెసేజ్‌ల వివరాలను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి, తాము ఎంపిక చేసుకున్న పిల్లలు పంపిన ఎస్సెమ్మెస్‌లను సేకరించి ప్రత్యేకంగా భద్రపరచి అనంతరం వాటిని విశ్లేషించామని, ఇందులో పిల్లలు తమ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, ఇతరత్రా పరిచయస్తుల ప్రవర్తన గురించి రాసిన అంశాలను ప్రధానంగా స్వీకరించి వాటిపై అధ్యయనం చేసినట్టు శామ్యూల్ తెలిపారు. ఈ అధ్యయనంలో ఆయా పిల్లలు ముందుముందు ఎలాంటి పరిస్థితుల్లో పడబోతారనే అంశాన్ని అంచనావేయగలిగామని శామ్యూల్ చెబుతున్నారు.