: కరెన్సీ నోట్లతో దండలు తయారుచేయొద్దు: రిజర్వ్ బ్యాంకు
కరెన్సీ నోట్లతో దండలు తయారుచేసే సంప్రదాయానికి స్వస్తి పలకాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు సూచించింది. ఊరేగింపుల్లోనూ, ఫంక్షన్లలోనూ నోట్లతో దండలు చేసి వ్యక్తుల మెడల్లో వేయడం, విగ్రహాలను నోట్లతో అలంకరించడం సరికాదని పేర్కొంది. కరెన్సీ నోట్లు దేశ సార్వభౌమత్వానికి చిహ్నాలని, వాటిని గౌరవించడం మన విధి అని హితవు పలికింది. పైగా అలా చేస్తే ఆ నోట్లు వినియోగానికి పనికిరాకుండా పోతాయని అభిప్రాయపడింది. అయితే, 1949 బ్యాంకింగ్ చట్టాన్ననుసరించి గానీ, ఆర్ బీఐ చట్టాన్ని అనుసరించి గానీ కరెన్సీ నోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన నిబంధనలు లేవు. ఈ నేపథ్యంలో ఆర్ బీఐ సూచనలు ఎంతమంది తలకెక్కుతాయన్నది ప్రశ్నార్థకమే.