: 13 జిల్లాల్లో ప్రభుత్వ పాలన స్తంభించింది: అశోక్ బాబు


13 జిల్లాల్లో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయిందని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాజాగా హైదరాబాదులో తెలంగాణ సోదరుల వైఖరి వివాదాస్పదంగా ఉందని మండిపడ్డారు. హక్కులను హరించడం సరికాదని వారికి హితవు పలికారు. ప్రస్తుతం రాజధానిలో నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా హైకోర్టు పరిసరాల్లో ఏర్పడ్డ శాంతిభద్రతల సమస్యలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు. న్యాయవాదులు ఘర్షణకు ప్రయత్నించడం, తదనంతరం చీఫ్ జస్టిస్ రెండు ప్రాంతాల న్యాయవాదులతో చర్చించడం సామరస్యపూర్వక సందేశాన్ని ఇవ్వడం లేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం లేకుండా చేయడం మంచి పద్దతి కాదని తెలంగాణ సోదరులకు హితవు పలికారు. న్యాయవాదుల జేఏసీ 4 గంటలకు కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. 16న సమ్మెపై హైకోర్టు తీర్పు ఇస్తుందని, ఎలాంటి తీర్పునిచ్చినా సమ్మెను కొనసాగిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు. కేంద్రం కేబినెట్ నోట్ తయారు చేశామని తెలిపిందని, ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పార్లమెంటు సెషన్ ముగిసిందని ఇప్పుడే చర్చ జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.

కేబినెట్ నోట్ ను అసెంబ్లీ లో ఎదుర్కోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా తమతో కలిసి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రాంత ఎంపీలు పార్లమెంటులో సమర్థవంతంగా స్పందించలేకపోయారని నిరాశ వ్యక్తం చేశారు. తమతో కలసిరాని ఎంపీలపై 'ప్రత్యేక కార్యాచరణ' ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలోకి బిల్లు వచ్చి చర్చ జరిగితే ఎవరు ఏ పాత్ర పోషించాలో చెబుతామని అన్నారు.

తీర్పు తరువాత హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులు చూసి కార్యాచరణను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే తమతో కలిసిరాని నేతలపై ఒత్తిడి తెస్తామని అశోక్ బాబు తెలిపారు. 16న జరిగే భేటీ తరువాత సమైక్యవేదికపై ఓ కమిటీ వేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. సీమాంధ్రలో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం సమ్మెలో ఉందని తెలిపారు. సమ్మెపై రాజీ లేదని మరింత తీవ్రం చేసే ఆలోచనలోనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

30 వేల మంది విద్యుత్ ఉద్యోగుల సమ్మెలో పాల్గొంటున్నారని, అందరం కలిసి ఒకే వేదికగా ఉంటామని పునరుద్ఘాటించారు. కామన్ క్యాపిటల్ నినాదం మాది కాదని స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ డిమాండ్ అన్నారు. సమ్మె చట్టబద్ధం కాదన్నా ఐడీ యాక్టు ప్రకారం సమ్మె జరుగుతోందన్నారు. ప్రైవేటు ఉద్యోగులు సమ్మెలోకి రాలేరన్న అశోక్ బాబు, ప్రైవేటు ఉద్యోగులను బంద్ లకు రమ్మంటే స్పందిస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News