: హైదరాబాద్ టీఆర్ఎస్ కు వ్యతిరేకం: శైలజానాథ్
ఏపీఎన్జీవోల సభ విజయవంతమవడంతో టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారని శైలజానాథ్ అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అందరికీ కార్యక్రమాలు జరుపుకునే హక్కు ఉందని టీఆర్ఎస్ నేతలు, టీజేఏసీ నేతలు గుర్తించాలని మంత్రి శైలజానాథ్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో అందరికీ తెలిసిందే అన్నారు. అలాగే హైదరాబాదులో టీఆర్ఎస్ కు పెద్దగా ప్రాతినిధ్యం లేదని చెప్పుకొచ్చారు.
తాజాగా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మలు చేస్తున్న ఆరోపణలు సరికావని తప్పుపట్టారు. రాష్ట్రం రావణకాష్టంలా మండుతుంటే టీడీపీ అధినేత అధికారమివ్వండి ఆరు నెలల్లో మారుస్తామంటున్నారని విమర్శించారు. మరోవైపు, లక్షల కోట్లివ్వండి అని అడుగుతున్నారు అంటే విభజిస్తారా? అని శైలజానాథ్ చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నించారు. అఖిలపక్షంలో తెలంగాణాకు అనుకూలం అని చెప్పిన వైఎస్సార్సీపీ ఇప్పుడు సమన్యాయం చేయండి అంటున్నారని మండిపడ్డారు.
అసలు సమన్యాయం అంటే ఏమిటో తెలుసా? అని అడిగారు. 'సమన్యాయం అంటే విభజించాలనే కదా అర్థం' అని వివరించారు. ఇప్పటికీ టీడీపీ, వైఎస్సార్సీపీ ఓట్లు, సీట్లు రాజకీయాలే చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాత్రం ఏ రకమైన ఆప్షన్లు లేకుండా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు. మీరూ వ్యతిరేకించండంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అత్యధికులు ఐక్యత కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ తామందరూ ఒకే మాటమీద నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. విపక్షాల సభ్యులు రాజీనామాలు ఆమోదింపజేసుకుంటామంటున్నారని, అందులో చాలా అనుమానాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కై ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నించారు.
మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పని చేస్తాయని, అలాంటిది అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు, దాన్ని సభ్యులు లేకుండా ఆమోదిస్తే జరిగేదేమిటో మీకు తెలియాదా? అని ఆ రెండు పార్టీల అధినేతలను శైలజానాథ్ ప్రశ్నించారు. గతాన్ని మర్చిపోండి, ఇప్పటికైన సమైక్యానికి మద్దతు పలకండి అంటూ ఆయన టీడీపీ, వైఎస్సార్సీపీలకు హితవు పలికారు.