: ఆ నలుగురికీ లాస్ట్ చాన్స్!
వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్.. కొన్నాళ్ళ వరకు ఈ చతుష్టయం లేకుండా టీమిండియాను ఊహించుకోవడం కొంచెం కష్టంగానే ఉండేది. కానీ, ఫామ్ లేమి, ఎడతెగని గాయాలతో ఈ నలుగురి కెరీర్ మసకబారింది. మరోవైపు, వీళ్ళ స్థానాల్లో జట్టులోకొచ్చిన శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ వంటి యువ కిశోరాలు అద్భుతమైన ఆటతీరుతో సెలెక్టర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ల గురించి ఆలోచించే వారే లేకపోయారు. దాదాపు మీడియా కూడా వీరిని పక్కనపెట్టినట్టే కనిపిస్తోంది. అయితే, చీకట్లో కాంతిరేఖలా బీసీసీఐ ఈ నలుగురికి చివరి అవకాశం కల్పిస్తోంది. తమ ఫామ్ ను, ఫిట్ నెస్ ను చాటుకునేందుకు ఓ చాన్స్ ఇవ్వాలని భావిస్తోంది.
ఈ క్రమంలో త్వరలో విండీస్-ఎ జట్టుతో భారత్ లోనే జరిగే వన్డే, టీ20, అనధికార టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు వీరిని ఎంపికచేసింది. విండీస్-ఎతో ఈ నెల 15,17, 19 తేదీల్లో జరిగే వన్డే సిరీస్ లో పాల్గొనే భారత్-ఎ జట్టు పగ్గాలు యువరాజ్ కు అప్పగించిన బీసీసీఐ.. అక్టోబర్ లో జరిగే రెండవ, మూడవ అనధికార టెస్టు మ్యాచ్ ల్లో సెహ్వాగ్, గంభీర్, జహీర్ లకు చోటు కల్పించింది. ఈ నాలుగురోజుల మ్యాచ్ ల్లో పాల్గొనే భారత్-ఎ జట్టుకు ఛటేశ్వర్ పుజారా నాయకత్వం వహిస్తాడు.