: జగన్ కేసులో నేడో, రేపో సీబీఐ చివరి ఛార్జ్ షీట్


వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈ రోజో, రేపో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆరు అంశాలపై ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసింది. పెన్నా, ఇండియా సిమెంట్స్, భారతీ సిమెంట్, సండూర్ పవర్, కోల్ కతా, ముంబయి పవర్ బోగస్ సంస్థల పెట్టుబడులు, ఇందూ, లేపాక్షి వ్యవహారంపై ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. వీటిపై ఇటీవలే సీబీఐ జేడీ వెంకటేష్ ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులతో చర్చించారు. ఆరు అంశాలపై ఛార్జ్ షీట్లలో జగన్, విజయసాయి రెడ్డి పేర్లను ప్రముఖంగా పేర్కొననుంది.

పెన్నా సంస్థకు గనులు, భూ కేటాయింపు, భవన నిర్మాణ నిబంధనల సడలింపు వ్యవహారంలో ప్రతాప్ రెడ్డి, ఇద్దరు మాజీ మంత్రులతో పాటు, కొందరు ఐఏఎస్ అధికారులను కూడా నిందితులుగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఒక మాజీ మంత్రి, ఇద్దరు ఐపీఎస్ లు, భారతీ సిమెంట్స్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఓ ఐఎఎస్ అధికారిని నిందితులుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందూ, లేపాక్షి వ్యవహారంలో బీపీ ఆచార్య, ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు లేదా ముగ్గురు ఐఎఎస్ లతో పాటు ఓ మంత్రి.. సండూర్ పవర్ వ్యవహారంలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు ఉండే అవకాశాలున్నాయి.

ఇక కోల్ కతా, ముంబయి బోగస్ సంస్థల పెట్టుబడుల వెనుక హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థను సీబీఐ గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు విధించిన గడువు సోమవారంతో (9వ తేదీ) ముగిసింది.

  • Loading...

More Telugu News