: ప్రతి పదిమంది పురుషుల్లో ఒకరు రేపిస్టే..!
ఎక్కడ చూసినా నిత్యం మగువలపై అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. దీనిపై బ్రిటిష్ మెడికల్ జర్నల్ లాన్సెట్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఒక సర్వే నిర్వహించి ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రాంతంలో ప్రతి 10 మంది మగవారిలో ఒకరు మహిళలపై అత్యాచారం చేసిన వారేనని తేలింది. బంగ్లాదేశ్, కంబోడియా, చైనా, ఇండోనేషియా, పపువా న్యూగినియా, శ్రీలంక దేశాలలో 10 వేల మంది పురుషులపై లాన్సెట్ ఈ సర్వే నిర్వహించింది.
11 శాతం మంది పురుషులు తమ జీవిత భాగస్వాములు కాని వారిపై అత్యాచారం చేశామని తెలిపారు. భార్యపై అత్యాచారం చేసిన వారినీ కలిపితే వీరు 24 శాతంగా ఉన్నారు. 45 శాతం మంది ఒకరికంటే ఎక్కువ మందిపై లైంగిక దాడి చేశామని ఒప్పుకున్నారు. 59 శాతం మంది ఆనందం కోసమే అత్యాచారం చేశామంటే, 38 శాతం మంది శిక్షించడం కోసమే పైశాచికంగా అలా చేశామన్నారు.