: వయసును ఆపొచ్చు!
వయసు మీదపడకుండా ఆపడం సాధ్యమా... అంటే సాధ్యమే అంటున్నారు. శాస్త్రవేత్తలు. ఎందుకంటే వయసు పెరుగుదలను కాస్త ఆలస్యం చేయడంలో ఉపకరించే ఒక కొత్త జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జన్యువు ద్వారా మనిషి ఆయుష్షును కూడా పెంచవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్‌కు చెందిన కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు డాక్టర్ టకెహికో కొబయాషి నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనంలో మనిషిలో వృద్ధాప్యానికి కారక జన్యువును గుర్తించారు. ఈ జన్యువు మనిషిలో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి, ఆయుష్షును పెంచడంలో ఉపకరిస్తుందనే విషయాన్ని కనుగొన్నారు. అయితే ఈ ఆర్‌డీఎన్‌ఏ జన్యువులు మనుషుల్లో అస్థిరత్వంతో ఉంటాయని, వాటి స్థిరత్వాన్ని పెంచితే ఆయుష్షును కూడా పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో కీలకమైన సిర్2 జన్యువులను ఈస్ట్ కణాల్లో శాస్త్రవేత్తలు ఇదివరకే కనుగొన్నారు. ఈ జన్యువులు ఆర్‌డీఎన్‌ఏ స్థిరత్వాన్ని నియంత్రించడం ద్వారానే ఆయుష్షును పెంచుతున్నాయని ఈ తాజా పరిశోధనలో గుర్తించారు. సిర్2 జన్యువు లాగానే మనుషుల్లో కూడా ఏడు సిర్టూన్స్ జన్యువులు ఉంటాయని, కానీ అవి సిర్2కు భిన్నమైన పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధనల్లో కనుగొన్నారు. అయితే ఈస్ట్ కణాల్లోను, మనుషుల్లోనూ ఆర్‌డీఎన్‌ఏ స్థిరంగా ఉండటమే కీలకమని, కాబట్టి ఆ దిశగా పరిశోధన చేస్తే మనిషి ఆయుష్షును కూడా పెంచవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.