: తెలంగాణను ఆపుతామని పగటి కలలు కంటున్నారు: కేసీఆర్


తెలంగాణ ఆకాంక్ష విజయ తీరాలకు చేరబోతోందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, త్వరలో టీజేఏసీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆ సభ జరిగే తేదీ, సభా వేదిక పేరు, సభ యొక్క అజెండాను కోదండరాం వెల్లడిస్తారని అన్నారు. తెలంగాణ కల సాకారమవుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యమసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే, ఆ సభలో ఏయే విషయాలు చర్చించాలి? ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి? అన్నది సమగ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు.

తమకు ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన డిమాండ్ చేశారు. తాను ఢిల్లీలో పలువురు పెద్దలతో చర్చించానని, పది జిల్లాల తెలంగాణ ఆకాంక్షను తెలిపానని అన్నారు. పది జిల్లాల తెలంగాణ తప్ప ఇతర ప్రత్యామ్నాయాల్ని అంగీకరించే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణ విషయంలో ఎటువంటి మినహాయింపులు లేవని కేంద్రానికి మరోసారి నొక్కి వక్కాణించాలంటే భారీ సభ జరపాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈసారి ఏమాత్రం నిర్లక్ష్యవైఖరితో ఉండొద్దని హితవు పలికారు. అంతిమ నిర్ణయం వచ్చే వరకు జేఏసీలో విస్తృత చర్చ జరగుతుందని, దాని ప్రకారం వెళ్తామని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తమ ప్రజల అజెండాయే జేఏసీ అజెండా అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఆపుతామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యోగుల సభకు వచ్చిన డ్రైవర్లంత మంది కూడా ఏపీఎన్జీవోల సభకు రాలేదని అపహాస్యం చేశారు. 13 సంవత్సరాల ఉద్యమంలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఒక్క మనిషిని కూడా తాము హింసించలేదని కేసీఆర్ అన్నారు. జాతీయ మీడియాలో కానీ, అమెరికా వాల్ స్ట్రీట్ జర్నల్ లో కానీ తమ గాంధేయ ఉద్యమాన్ని ప్రశంసించారని తెలిపారు. సీమాంధ్రలో చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం దుర్మార్గంగా, హేయంగా, జుగుప్సంగా ఉందని ఆక్రోశం వెళ్లగక్కారు.

కేసీఆర్ ను లక్ష రకాల దూషణలు చేయచ్చు, అయినా తాను లక్ష్యాన్ని సాధిస్తానని సవాలు చేశారు. కోదండరాం ఇచ్చిన ప్రాంప్టింగ్ తో ఇదే శాంతియుత పంథాను పాటిస్తామని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News