: సిరియాపై సైనిక చర్యతో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుంది: రష్యా
సిరియాపై సైనిక చర్యతో ఆ ప్రాంతంలో ఉగ్రవాదం జడలు విచ్చుకుంటుందని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఘర్షణకు ముగింపు పలకడానికి సిరియా చర్చలకు సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లారోవ్ తెలిపారు. సైనిక చర్య వల్ల సిరియాతోపాటు ఇరుగు పొరుగు దేశాలలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని తాము అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మౌలెమ్ తో సమావేశం అనంతరం సెర్గీ మీడియాతో మాట్లాడారు.
సైనిక చర్యతో శరణార్థులు కూడా పెరిగిపోతారన్నారు. సిరియాలో ఉన్న రష్యన్ల భవిష్యత్తుపై తమకేమీ ఆందోళన లేదని సెర్గీ చెప్పారు. సిరియా ప్రభుత్వం రాజధాని డమాస్కస్ లో గతనెలలో పౌరులపై రసాయనిక దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 1400 మంది మరణించారని అమెరికా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ చర్యకు దాడులతో బుద్ధి చెప్పాలని అమెరికా యోచిస్తోంది.