: గర్ల్‌ఫ్రెండ్ కావలెను...
నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావలెరా... అంటూ ఒక సినిమాలో పాట గుర్తుందా... సరిగ్గా ఇలాగే ఒక ప్రేమికుడు తన గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. అబ్బా... ఇలా ప్రేమగా ఎదురుచూసే ప్రియుడ్ని కాదన్న ప్రేయసి ఎవరా? అని మీరు ఆశ్చర్యపోతున్నారా... ఎవరూ లేరు. ఎందుకంటే సదరు ప్రేమికుడ్ని ప్రేమించడానికి ప్రస్తుతం ఒక గర్ల్‌ఫ్రెండ్ కావాలి. ఇందుకోసం ఈ ప్రేమికుడు ఏకంగా కొన్ని వేల డాలర్లు వెచ్చించి మరీ ప్రకటనలు గుప్పిస్తున్నాడు.
షికాగోలో గోర్డాన్ అనే ఒక వ్యక్తి నిత్యం రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్ వే పక్కన తన పేరుతో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టించాడు. అందులో 'నేను గోర్డాన్‌ను... మంచి విందుచేద్దాం రా' అంటూ రాయడంతోబాటు తన ఫోన్ నంబర్, ఇతర వివరాలను కూడా ఆ హోర్డింగులో ఇచ్చాడు. ఇప్పటికే విడాకులు పొందిన గోర్డాన్ ఇప్పుడు కొత్త ప్రియురాలికోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే కొన్ని వేల డాలర్లు వెచ్చించి ఇలా వాణిజ్య ప్రకటనల తరహాలో పెద్ద పెద్ద హోర్డింగులను ఏర్పాటు చేశాడు. తగిన పడతి దొరికితే... ఆమెతో డేటింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నాడు. మరి ఈ హోర్డింగుల దెబ్బకు పడిపోయి గోర్డాన్‌ను ఎవరు వలచి, వలపించుకుంటారో... చూడాల్సివుంది.