: మితమైన ఉప్పుతో మరణం ముప్పు తప్పుతుంది
ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారపదార్ధాలకు చక్కటి రుచిని అందించేది ఏది... అని అడిగితే ఠక్కున మనం చెప్పే సమాధానం ఉప్పు. దీన్ని తక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని చాలామంది పరిశోధకులు హెచ్చరిస్తుంటారు. ఉప్పులో ఎక్కువ మోతాదులో ఉండే సోడియం వల్ల మనకు ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కాబట్టి దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంటారు. ఉప్పులో ఉండే మరో మూలకాన్ని శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ మూలకమే క్లోరైడ్. ఇది మన శరీరంలో తగినంత మోతాదులో లేకపోతే మరణం ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలో తేల్చారు. కాబట్టి ఆహారంలో ఉప్పును తగు మోతాదులో ఉండేలా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారు.
గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రత్యేక అధ్యయనం ద్వారా శరీరంలో క్లోరైడ్ స్థాయి తగ్గితే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దీనిఫలితంగా మరణం సంభవించే ప్రమాదం కూడా ఉందని తేల్చారు. ఈ పరిశోధనకు భారత సంతతికి చెందిన వైద్యులు సంతోష్ పద్మనాభన్ నేతృత్వం వహించారు. ఉప్పులో ఉన్న సోడియం ఎక్కువ కావడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులోనే ఉన్న మరో మూలకం క్లోరైడ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారిలో క్లోరైడ్ స్థాయి తగ్గితే వారికి గుండె జబ్బులు రావడంతోబాటు, మరణం ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో తేలింది.
ఇందుకోసం వీరు సుమారు 13 వేలమంది రోగుల డేటాను విశ్లేషించారు. దాదాపు 35 ఏళ్లపాటు వారిని పరిశీలించారు. రక్తంలో క్లోరైడ్ స్థాయి తక్కువగా ఉన్న బృందానికి మిగిలినవారితో పోలిస్తే మరణం ముప్పు 20 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఈ విషయం గురించి పద్మనాభన్ మాట్లాడుతూ ఎక్కువ రక్తపోటును కలిగించడంలో కీలక పాత్రను పోషించడం వల్ల ఉప్పును అందరూ విలన్‌లాగా చూస్తారని, అయితే అదే సమయంలో ఉప్పులోని క్లోరైడ్ వల్ల కలిగే మేలును అందరూ విస్మరిస్తున్నారని అన్నారు. అయితే ఈ పరిశోధనలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, వీటి ఫలితాల ఆధారంగా ఎలాంటి నిర్ధారణలకు రాలేమని ఆయన అన్నారు. శరీరంలో క్లోరైడ్ పాత్ర గురించి తేల్చేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని ఆయన చెబుతున్నారు.