: ట్రాఫిక్‌ సమస్యలకు నెట్‌ పరిష్కారమార్గం


ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజల్లో ట్రాఫిక్‌ పట్ల అవగాహన కలిగించడంతోబాటు, రోడ్డు నియమాలను గురించి కూడా అవగాహన కలిగించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ట్రాఫిక్‌ సమస్యలను ఇంటర్నెట్‌ ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్‌లో సామాజిక వెబ్‌సైట్లయిన ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటివాటిలో చాలామందే స్నేహితులను కలిగివున్నారు. ఇలాంటి వాటిద్వారా ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ హైఫా, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ విభాగానికి అధిపతి అయిన డాక్టర్‌ టివి కుఫ్లిక్‌ ప్రత్యేక అధ్యయనం ద్వారా ట్విటర్‌ కేవలం ఒక సామాజిక మాధ్యమమే కాదని, దీని ద్వారా ట్రాఫిక్‌ సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు. ఏదైనా ఒక పెద్ద ఉత్సవం లాంటిది నిర్వహించేముందు ఆ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులపై ట్విటర్‌లో వాహనాలను నడిపేవారినుండి అభిప్రాయాలను, అనుభవాలను స్వీకరించి వాటిద్వారా అక్కడ ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉందని కుఫ్లిక్‌ చెబుతున్నారు. దీనిపై ఆయన మూడేళ్లపాటు అధ్యయనం సాగించారు. లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆడే ఫుట్‌బాల్‌ ఆటకు జెరూసలేంలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ ఆటలు జరిగే తేదీలను ముందుగానే ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఆట జరగడానికి కొన్ని గంటలముందు, కొన్ని గంటల తర్వాత ట్రాఫిక్‌ అనుభవాలపై ట్విటర్‌లో అభిప్రాయాలు సేకరించారు. దీనిపై 1100 మంది స్పందించారు. ఎక్కడ నిజమైన ట్రాఫిక్‌ సమస్య ఉందో, దాన్ని పరిష్కరించడానికి ఏం చేయవచ్చో కూడా ఇందులో సూచించారట. కాబట్టి సామాజిక వెబ్‌సైట్లను ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించడంలో కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చని కుఫ్లిక్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News