: మరింత శక్తిమంతమైన సోలార్ సెల్స్
సౌరశక్తిని గ్రహించేందుకు ప్రత్యేకమైన సెల్స్‌ను ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ముందుకువస్తున్నారు. ఎందుకంటే విద్యుత్తు ఆదా విషయంలో ప్రజల్లో ఎక్కువ అవగాహన కలుగుతోంది. దీంతో సౌరశక్తిని విద్యుత్తుగా మార్చుకోవడంలోను, ఇతర గృహ అవసరాలకు ఉపయోగించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సౌరవిద్యుత్తును పోగుచేసే సౌరసెల్స్‌ని ఒకదానిపై మరొకటి అమరుస్తారు. ఇవి అత్యంత సమర్ధవంతమైనవి. తాము గ్రహించే సౌరశక్తిలో 45 శాతాన్ని విద్యుత్తుగా మారుస్తాయి. అయితే ఇవి మరింత సమర్ధవంతంగా పనిచేయాలంటే వాటిమధ్య ఉన్న అనుసంధాన జంక్షన్లు సౌరశక్తిని గ్రహించకుండా ఉండేలా చూడాలి. అలాగే ఇవి ఉత్పత్తి చేసే వోల్టేజీని దారిమళ్లించకుండా కూడా చూడాలి. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఒక సూర్యుడినుండి వెలువడే శక్తినే కాకుండా 70 వేల సూర్యుళ్లు నుండి వెలువడే శక్తినైనా తట్టుకునేలా ప్రత్యేకమైన సౌరసెల్స్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.
అమెరికాలో ఉత్తర కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సౌర సెల్స్‌ను తయారు చేశారు. సౌరశక్తిని గ్రహించే సెల్స్ ఉత్పత్తిచేసే వోల్టేజిని దారిమళ్లించకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో అనుసంధాన జంక్షన్ల మధ్య గ్యాలియం ఆర్సెనైడ్ పొరను కనెక్టింగ్ జంక్షన్‌లోకి చొప్పిస్తారు. దీనివల్ల సౌరశక్తిని అడ్డుకోకుండానే ఓల్టేజ్ నష్టాన్ని నిర్మూలించవచ్చని ఉత్తర కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన సాలా బెడేర్ చెబుతున్నారు. ఇవి సౌరశక్తి పరికరాల సామర్ధ్యాన్ని పెంచుతాయని, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తాయని, ఇది చాలా ముఖ్యమైన చర్య అని, ఎందుకంటే ఫోటోవోల్టాయిక్ కంపెనీలు సౌరశక్తిని కేంద్రీకరించేందుకు లెన్సులను వాడటంపై ఆసక్తిని చూపుతున్నాయని బెడేర్ వివరించారు. ఎలాంటి లెన్స్‌లు వాడకపోవడంతో పోలిస్తే నాలుగువేల సూర్యుళ్ల శక్తికి సమానమైన శక్తి వాటిమీద పడుతుందని, ప్రస్తుతం వాడుతున్న స్ట్యాక్డ్ సౌర సెల్స్‌లో 700 సూర్యుళ్ల స్థాయికి సౌరశక్తి పెంచితే అనుసంధాన జంక్షన్లు ఓల్టేజిని కోల్పోతాయని, అయితే తాము రూపొందించిన అనుసంధాన జంక్షన్లు 70 వేల సూర్యుళ్ల శక్తినైనా తట్టుకోగలవని బెడేర్ చెబుతున్నారు.