: 'ఫ్యాను'కు కరెంటు.. 'కారు'కు పెట్రోలు..కాంగ్రెస్ చలవే: బాబు
వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలికాచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సమస్యను పరిష్కరిస్తామని ఎక్కడా చెప్పడంలేదని బాబు విమర్శించారు. కృష్ణాజిల్లాలో నూజివీడు నియోజకవర్గంలో బస్సుయాత్ర చేస్తున్న బాబు పోతురెడ్డిపల్లిలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో, తెలంగాణలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ అంటకాగుతోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ 'ఫ్యాను'కు కరెంటు అందించేది, టీఆర్ఎస్ 'కారు'కు పెట్రోల్ పోసేది కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు.
ఇక దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన జగన్ డీఎన్ఏ తమ డీఎన్ఏ ఒకటేనంటారని, అది దొంగల డీఎన్ఏ అని దుయ్యబట్టారు. ఇడుపులపాయకు ఇటలీకి లింకు కుదిరిందని చెప్పుకొచ్చారు. సోనియా కొడుకు రాహుల్ ఓ మొద్దబ్బాయని, ఆయనను ప్రధాని చేయాలని.. ఇక్కడ విజయమ్మ కొడుకు జగన్ ఓ దొంగబ్బాయని, ఇతను సీఎం కావాలని తాజాగా విభజన కుట్రకు రూపకల్పన చేశారని మండిపడ్డారు. అదివారి కల అని ఎక్కడైనా కల నిజం అవుతుందా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంతో భయపడే ఈ పార్టీలు ఇలా కుట్రకు తెరదీశాయని బాబు ఆరోపించారు
అంతకుముందు ప్రధాని మన్మోహన్ పై విమర్శలు చేస్తూ, ఆయనను తుగ్లక్ అని అభివర్ణించారు. బంగారం కొనవద్దని ప్రజలకు సూచించడానికి ఆయనెవరని బాబు ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే రైతులు తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వీలుగా తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు.