: ఒక్కరోజు చాలు...
వారంలో ఒక్కరోజు చాలు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. అదేంటి... ఒక్కరోజులో ఎలా కాపాడుకోగలం... అనుకుంటున్నారా... అయితే ఒక్కరోజు మాత్రమే చాలని, ఆ ఒక్కరోజు చక్కటి వ్యాయామం చేస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు.
అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అరవై ఏళ్లు నిండిన మహిళలకు వారానికి ఒకసారి వ్యాయామం చేస్తే చాలు, ఆరోగ్యంగా, ధృడంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం వీరు అరవై ఏళ్లు నిండిన కొందరు మహిళలను ఎంపిక చేసుకుని వారిపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించి మరీ ఈ విషయం చెబుతున్నారు. తమ అధ్యయనం కోసం వారు కొందరు మహిళలను ఎంపిక చేసుకుని వారిని మూడు బృందాలుగా విభజించారు. వరుసగా పదహారు రోజులపాటు వారికి ఏరోబిక్ వ్యాయామ శిక్షణ (ఏఈటీ), రెసిస్టెన్స్ వ్యాయామ శిక్షణ (ఆర్‌ఈటీ) ఇచ్చారు. వీరిలో ఒక బృందానికి వారానికి ఒకసారి, రెండవ బృందానికి రెండుసార్లు, మూడవ బృందానికి మూడుసార్లు ఈ వ్యాయామాలు చేసేలా చూశారు. అనంతరం వారి కండరాల పటుత్వాన్ని, గుండె రక్తనాళాల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. వీరిలో వారానికి ఒకసారి మాత్రమే వ్యాయామం చేసిన వారికి, రెండుసార్లు, మూడుసార్లు వ్యాయామం చేసిన వారికి మధ్య పెద్ద తేడా కనిపించలేదని తేలింది. అందుకే వయసు మీరిన మహిళలు వారానికి ఒకసారి చక్కటి వ్యాయామం చేస్తే చాలని, వారు ఆరోగ్యంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.