: ఇదొక సరికొత్త ఆవిష్కరణ
ప్రకృతిని పరిశీలిస్తే... అందులో మనకు తెలియని ఎన్నో విశేషాలు దాగివుంటాయి. వాటిని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అదే శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రకృతి విశేషాలను తెలుసుకుంటే... వాటిని తమ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త వస్తువుల రూపకల్పనకు ఉపయోగిస్తారు. ఇలా ప్రకృతిలోని సీతాకోక చిలుక రెక్కలను స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలు సరికొత్త నానో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ క్రిస్టల్ని ఆవిష్కరించారు. దీంతో ఇకపై మరింత వేగంగా సురక్షితమైన ఆప్టికల్ పరికరాలను తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా-జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు కాలోఫ్రిస్ రుబి అనే సీతాకోక చిలుక రెక్కలను స్ఫూర్తిగా తీసుకుని సరికొత్త నానో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ క్రిస్టల్ని ఆవిష్కరించారు. ఇలా ప్రకృతిని అనుసరిస్తూ సరికొత్త పరికరాలను ఆవిష్కరించడాన్ని 'బయో మిమిక్రీ' అంటారు. ఈ పద్ధతిలో శాస్త్రవేత్తలు ఈ క్రిస్టల్ని ఆవిష్కరించారు. ఇది మన వెంట్రుకంత వెడల్పు మాత్రమే ఉండి, '3డీ నానో' సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం టెలీకమ్యూనికేషన్స్, మల్టీమీడియా రంగాల్లో ఉపయోగించే ఆప్టికల్ పరికరాలను వాడే క్రిస్టల్కంటే కూడా ఇది భిన్నమైంది. మామూలు క్రిస్టల్స్ నేరుగా (లీనియర్) వెళ్లే కాంతిని మాత్రమే విడగొట్టగలవు. అయితే ఇప్పడు కొత్తగా తయారు చేసిన క్రిస్టల్ వృత్తాకారంలో ఉండే కాంతిని కూడా కుడి, ఎడమలుగా విడగొట్టగలుగుతుంది. ఫలితంగా ఇప్పటికంటే అతివేగంగా, సురక్షితమైన ఆప్టికల్ పరికరాలను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.