: తెలుగు ప్రజలు విడిపోయారనే అపప్రద మనకొద్దు: సత్యవాణి


తెలుగు ప్రజలు విడిపోయారనే అపప్రద మనకొద్దని అధ్యాపకుల సంఘం జేఏసీ అధ్యక్షురాలు సత్యవాణి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు ప్రజలను విభజించే దుర్ఘటన మనముండగా జరగకూడదని పిలుపునిచ్చారు. భారతంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన చిచ్చే నేడు కూడా రేగుతోందని గుర్తు చేశారు. తప్పుడు వ్యక్తుల చెప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు. భారత మాత కానీ, తెలుగుతల్లి కానీ తన పుత్రులు తన్నుకు చావడాన్ని హర్షించరని స్పష్టం చేశారు.

స్వార్థ ప్రయోజనాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు చాలామంది ఉన్నారని, వారిని వదిలెయ్యాలని ఆమె సూచించారు. శ్రీకృష్ణ కమిటీకి లేఖ ఇచ్చిన సందర్భంగా నాటి భారతంలో కూడా శ్రీకృష్ణుడే రాయబారం నడిపిన సంగతి గుర్తు చేశానని, దానికి జస్టిస్ శ్రీకృష్ణ అప్పటి రాయబారం విఫలమైందని, ఇది విఫలం కాదని అన్నారన్నారు. అలాగే కమిటీ నివేదికలో వాస్తవాలు గ్రహించకుండా విభజిస్తే తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నారని, ఇప్పుడు జరిగింది అదేనని ఆమె తెలిపారు.

మేధావివర్గం మొత్తం ఒక్కసారి ఆలోచించాలని ఆమె కోరారు. చట్ట సభలోనే మేధావిపై చేయిచేసుకుంటే జరిగిందేమిటని ఆమె గుర్తు చేశారు. మేధావులు ఇంకా నోరుమూసుకుని ఉంటే, కేంద్రం ఇంకా విభజనే అంటూ ముందుకెళితే బీష్ముడిని అంపశయ్యమీద పడుకో బెట్టినట్టు పడుకోబెడతారని గుర్తించాలని కోరారు. తెలంగాణ సంస్కృతి ఎంతో ఉన్నతమైనదని, అక్కడ ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.

అలాంటి తెలంగాణ వారు అందరినీ ఆదరిస్తున్నారని అయితే జై తెలంగాణ అనకపోతే మెడమీద కత్తిపెట్టి ఒప్పిస్తున్నారని మండిపడ్డారు. అంతెందుకు, బతుకమ్మ తల్లిని కూడా ఒక ప్రాంతానికే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్రీపాయింట్ పెట్టుకోమని కొందరు నేతలు చెబుతున్నారు. మీ అమ్మలు, మీ భార్యలు కర్రీలు చేయడంలేదా ఆ కర్రీలు మీరు తినడం లేదా అని ప్రశ్నించారు.

వారికి వినాయకుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. అలాగే తెలుగుతల్లిని విడదీశామనే అపప్రద మనకొద్దని, ఆ చరిత్రకు సాక్షీభూతులుగా నిలిచే దుస్థితి కల్పించొద్దని ఆమె పిలుపునిచ్చారు. సభలో సత్యావాణి గారి ప్రసంగానికి విశేష ఆదరణ లభించింది. హర్షద్వానాలు మిన్నంటాయి. చివరి మాటగా సత్యవాణి గారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించారు. ప్రజలకోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజలకోసం పని చేయకపోతే ఆ ప్రజలే సెలవు ప్రకటిస్తారనే నిజాన్ని ఆయన గ్రహించారని తెలిపారు.

  • Loading...

More Telugu News