: మోడీని గుజరాత్ సీఎంగానే ఉండనివ్వండి: ఉద్ధవ్ థాక్రే
మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని శివసేన ఇప్పట్లో అంగీకరించేలా కనిపించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా వ్యతిరేకిస్తూనే ఉంది. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉంటేనే మంచిదని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పీఠంపై తనకు ఆశలేదని గతంలో మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు. అదే నిజమయితే మోడీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొంటున్న బీజేపీ పెద్దలకు ఆయన ఏ విధంగా నచ్చజెబుతారని ఉద్ధవ్ ప్రశ్నించారు. గతంలో చెప్పిన మాట మీదే మోడీ నిలబడాలని ఆయన సూచించారు. 2017 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలనే గుజరాత్ ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని.. కాబట్టి ఆయన అప్పటిదాకా సీఎంగానే ఉండాలని అన్నారు. గతంలో శరద్ పవార్ లాంటి వారు ఎంతోమంది ప్రధానమంత్రి కావాలని కలలు కన్నారని... కానీ అవేవీ నెరవేరలేదని అన్నారు. కాబట్టి మోడీ కూడా ప్రధాని కావాలన్న తన ప్రస్తుత కలలకు ముగింపు ఇవ్వాలని ఆయన సూచించారు.