: ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ 4 వేల కేజీలు
ఖైరతాబాద్ వినాయకుడికి రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది. అలాగే ఖైరతాబాద్ గణేశుడితో పాటు గణేశుడి లడ్డూకి కూడా మంచి ఆదరణ ఉంది. ఈ లడ్డూను తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం గ్రామంలో సురుచి స్వీట్స్ అధినేత పీవీవీఎస్ మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో తయారు చేశారు. నాలుగు వేల కేజీల బరువు కలిగిన భారీ లడ్డూను ప్రత్యేక వాహనంలో రేపు హైదరాబాద్ తరలించనున్నారు. దాదాపు 70 మంది కార్మికులు పది రోజులు శ్రమించి ఆ లడ్డూను తయారు చేశారు.
ఈ భారీ లడ్డూ కోసం 1600 కేజీల పంచదార, 1000 కేజీల శనగపప్పు, 900 కేజీల నెయ్యి, 200 కేజీల జీడిపప్పు, 100 కేజీల బాదం పప్పు, 50 కేజీల ఏలకులు, 10 కేజీల పచ్చకర్పూరం ఈ మహాలడ్డూ తయారీలో వాడినట్టు తెలిపారు. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఇమిడే 56 కేజీల మరో లడ్డూను తయారు చేసినట్టు వెల్లడించారు. ఆ లడ్డూను కూడా మహాలడ్డూతో పాటు పంపిస్తామని ఆయన తెలిపారు.