: 26 రోజుల తర్వాత భారతీయ ట్యాంకర్ కు విముక్తి
అసంబద్ధమైన కారణాలతో 26 రోజులపాటు నిర్బంధించిన భారతీయ ఆయిల్ ట్యాంకర్ ను ఇరాన్ అధికారులు విడిచిపెట్టారు. దీంతో ఇరాన్ లోని బందార్ అబ్బాస్ రేవు నుంచి 'ఎంటీ దేశ్ శాంతి' ఓడ భారత్ కు బయల్దేరింది. 1,40,000 టన్నుల ముడి చమురుతో ఇరాక్ లోని బస్రా నుంచి భారత్ కు బయల్దేరిన ఓడను పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆగస్ట్ 12న అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ, కాలుష్య కారణాలతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారతీయ ఓడను ఇరాన్ విడిచి పెట్టింది.