: మీరు రేపు షాపింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారా...
మీరు రేపు షాపింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారా... అయితే ఈరోజు చక్కగా కంటినిండా కునుకుతీయండి... రేపు మీరు చక్కటి షాపింగ్ చేస్తారు. అంతేకాదు... మీ షాపింగ్‌లో మంచి ఆరోగ్యవంతమైన ఆహారపదార్ధాలను కూడా కొనుగోలు చేస్తారట. ఈ విషయం ఊరకే చెప్పడంలేదు... పరిశోధకులు ప్రయోగాత్మకంగా పరిశీలించి మరీ చెబుతున్నారు. మనం ఈరోజు కంటినిండా నిద్రపోతే దాని ప్రభావం వల్ల రేపు చక్కగా షాపింగ్ చేయగలుగుతామట.
స్వీడన్‌కు చెందిన పరిశోధకులు కొందరు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ముందురోజు రాత్రి సరిగా నిద్రపోని వ్యక్తులు మరునాడు షాపింగ్ చేస్తే వారి షాపింగ్‌లో అనారోగ్యకరమైన ఆహారపదార్ధాలు అధికంగా ఉంటాయని తేలింది. నిద్రలేమి వల్ల ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోను స్థాయిలు మన శరీరంలో గణనీయంగా పెరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఈ హార్మోను స్థాయిలు పెరగడానికి వారు కొనే ఆహారపదార్ధాల శ్రేణికి ఎలాంటి సబంధం లేదని పరిశోధకులు వివరించారు. కెలొరీలను విపరీతంగా పెంచే ఆహారపదార్ధాలను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం నిద్రలేమి ప్రభావం స్పష్టమైందని పరిశోధకులు చెబుతున్నారు.
తాము పరిశోధనల కొరకు ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తులు సరిగా నిద్రపోకుండా ఉండేలా చూసి వారిని ఆ మర్నాడు మార్కెట్‌కు వెళ్లి కనీసం నలభై వస్తువులను కొనుగోలు చేయమంటే అందులో ఇరవై దాకా అత్యధిక కెలొరీలతో కూడిన ఆహారపదార్ధాలు ఉన్నాయని పరిశోధకులు వివరించారు. కాబట్టి మనం రేపు ఆహారపదార్ధాలను కొనుగోలు చేయడానికి షాపింగ్‌కు వెళ్లాలనుకుంటే ఈరోజు చక్కగా నిద్రపోతే మంచిది!