: సరిహద్దుల్ని కాపాడడంలో రాజీ లేదు: ఏకే ఆంటోనీ
లడఖ్ ప్రాంతంలో చైనా చొరబడిందని, భారత భూభాగాన్ని ఆక్రమించిందని వస్తున్న వార్తలను రక్షణశాఖా మంత్రి ఏకే ఆంటోనీ ఖండించారు. దీనిపై లోక్ సభలో ఆయన ఓ ప్రకటన చేశారు. చైనా 640 చదరపు కిలోమీటర్ల దూరం లడఖ్ సెక్టార్లో చొచ్చుకు వచ్చిందని సాక్షాత్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ తెలిపిందంటూ బీజేపీ, ఎస్పీ సభ్యులు ఆరోపించారు. విపక్షాల ఒత్తిడి నేపథ్యంలో రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చొరబాట్లను సహించేదని లేదన్నారు.
జాతీయ భద్రతా మండలి అధ్యక్షుడు శ్యాంశరణ్ లడఖ్ లో పర్యటించారని, నివేదిక కూడా ఇచ్చారని ఆంటోనీ తెలిపారు. అందులో ఆయన అలాంటి విషయాలేవీ పేర్కొనలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల్ని కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అయితే విపక్షాలు ఆయన సమాధానంతో ఏకీభవించలేదు. బీజేపీ, ఎస్పీ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.