: 'వేదిక విషయం సచిన్ కే వదిలేయండి'
సచిన్ టెండూల్కర్.. భారత క్రికెట్ చరిత్రలో మరెవ్వరికీ లభించనంత పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న బ్యాటింగ్ లెజెండ్. కెరీర్ లో 198 టెస్టులాడేసిన సచిన్ చారిత్రాత్మక 200వ టెస్టు ముంగిట నిలిచాడు. అయితే, ఇటీవల కాలంలో ఫామ్ లేమితో సతమతమవుతున్న ఈ ముంబైవాలా కెరీర్ కొనసాగింపు ప్రశ్నార్థకమైంది. ఓవైపు యువ ఆటగాళ్ళు సత్తా చాటుతుండడం, మరోవైపు మాజీల విమర్శలు సచిన్ ను ఆలోచనలో పడేశాయి. ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తే మేలని మాజీలు అంటుండగా.. కొన్నాళ్ళ నుంచి మాస్టర్ బ్లాస్టర్ వైఫల్యాలతోటే నెట్టుకొస్తున్నాడు.
వాస్తవానికి వచ్చే డిసెంబర్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో కంటే సొంతగడ్డపైనే సచిన్ 200వ టెస్టు ఆడేస్తే అది అతనికి, దేశానికి కూడా సెంటిమెంటు పరంగా బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే హడావుడిగా విండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ను తెరపైకి తెచ్చింది. నవంబర్లో విండీస్ వీరులు భారత్ రానుండగా ఇప్పుడు సచిన్ 200 టెస్టుకు వేదిక ఏదన్న విషయం చర్చనీయాంశం అయింది.
రొటేషన్ విధానం ప్రకారం ముంబయి గానీ, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ గానీ ఇప్పట్లో టెస్టులు నిర్వహించే వీల్లేదు. కానీ సచిన్ పుణ్యామని ఈ రెండు స్టేడియాలు విండీస్ తో రెండు టెస్టులకు వేదికలుగా అవకాశం దక్కించుకున్నాయి. అయితే సచిన్ సొంతగడ్డ ముంబయి కాబట్టి 200వ టెస్టు అక్కడే నిర్వహిస్తే, క్రికెట్ దేవుడికి గ్రాండ్ గా ఫేర్ వెల్ చెప్పడం సాధ్యమవుతుందని బోర్డు వర్గాలంటున్నాయి. కానీ, ఈడెన్ గార్డెన్స్ కూడా సచిన్ ఆడే చారిత్రక టెస్టుకు తామే ఆతిథ్యమిస్తానని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ముంబయి క్రికెట్ సంఘం, బెంగాల్ క్రికెట్ సంఘం ఎటూ తేల్చుకోలేక 200వ టెస్టు ఎక్కడ ఆడాలో నిర్ణయించుకునే చాన్స్ సచిన్ కే ఇవ్వాలని బీసీసీఐకి సూచిస్తున్నాయి. మరి, సచిన్ సొంతగడ్డపైనే కెరీర్ ముగించాలనుకుంటాడో, టీమిండియాకు అచ్చొచ్చిన ఈడెన్ గార్డెన్స్ లోనే ఆటకు అల్విదా చెప్పేందుకు మొగ్గు చూపుతాడో వేచిచూడాలి.