: గుంపులుగా రావొద్దు, నినాదాలు చేయొద్దు: అశోక్ బాబు
రేపు హైదారబాదులో జరిగే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరయ్యే ఉద్యోగులకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పలు సూచనలు చేశారు. సభపై పలు ఆంక్షలు ఉన్నందున ఎవరూ గుంపులుగా రావొద్దని, బ్యానర్లు చేతపట్టి, నినాదాలు చేయొద్దని స్పష్టం చేశారు. వాహనాల నుంచి దిగిన వెంటనే విడివిడిగా సభావేదిక వద్దకు రావాలని సూచించారు. సభను రసాభాస చేసేందుకు అరాచక శక్తులు ప్రయత్నించే అవకాశాలున్నందున ఉద్యోగులు సంయమనం పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఇక, సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. సభ విజయవంతానికి కృషి చేస్తామని అన్నారు. రాజకీయనేతలు సభకు హాజరయ్యేందుకు అనుమతిలేనందున వారు బయటి నుంచి మద్దతివ్వాలని అశోక్ బాబు సూచించారు.