: భారత క్రికెటర్లకు అందని డాలర్ ఫలాలు
ఐపీఎల్ లో భారత క్రికెటర్లు ఇప్పుడు విదేశీ క్రికెటర్లను చూసి అసూయపడుతున్నారు! తమ కంటే వారు నాలుగు డాలర్లు ఎక్కువగా వెనకేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ డాలర్ల గొడవేంటో వివరంగా చూద్దాం. రూపాయి మారకంలో డాలర్ విలువ ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయి 66కు చేరుకుంది. దీనివల్ల ఐపీఎల్ లో భారత క్రికెటర్లకు ఎప్పటిలానే పారితోషికం వస్తుండగా.. విదేశీ ఆటగాళ్లకు మాత్రం అదనంగా వస్తోంది. దీనికి కారణం.. భారత క్రికెటర్లను డాలర్ రేటులోనే కొనుగోలు చేసినా ఫ్రాంచైజీలు రూపాయలలోనే చెల్లింపులు జరుపుతున్నాయి. అదీ పాత రేటు ప్రకారమే. కానీ, విదేశీ ఆటగాళ్లకు మాత్రం డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంది. దీంతో డాలర్ రేటు పెరిగినా ఆ ఫలం మన క్రికెటర్లకు దక్కడం లేదు.
ఉదాహరణకు గంభీర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 2010 లో మూడేళ్ల కాలానికి 24లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు డాలర్ రేటు పెరిగినా ఒప్పందం ప్రకారం 2010లో డాలర్ తో రూపాయి మారకం విలువ 46 ప్రకారమే కోల్ కతా నైట్ రైడర్స్ గంభీర్ కు చెల్లిస్తోంది. గంభీర్ ఒక్కడే కాదు, భారత క్రికెటర్లందరి పరిస్థితి ఇంతే. విదేశీ ఆటగాళ్లు మాత్రం డాలర్ ఫలాలతో ఖుషీ చేసుకుంటున్నారు. అయితే, ఇలా డాలర్లలో చెల్లించాల్సి రావడంతో ఫ్రాంచైజీలపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి జరగబోయే ఐపీఎల్ వేలం పాటలలో ఆటగాళ్లను రూపాయిలలోనే కొనుక్కోవాలని ఫ్రాంచైజీలు యోచిస్తున్నాయి.