: హోరెత్తిన 'లక్ష గళ సమైక్య భేరి'..
చిత్తూరు జిల్లా తిరుపతిలో లక్షగళ సమైక్యభేరి హోరెత్తింది. మున్సిపల్ కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయింది. సమైక్యాంధ్ర తిరుపతి జేఏసీ చేపట్టిన లక్షగళ సమైక్యభేరిలో పాల్గొనేందుకు భారీగా సమైక్యవాదులు తరలివచ్చారు.
ఇక, సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో 36వ రోజు ఆందోళనలతో దద్దరిల్లింది. జిల్లావ్యాప్తంగా 486 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు, హైదరాబాద్ సభకు హాజరయ్యేందుకు ఏన్జీవో నేతలు సిద్ధమవుతున్నారు. విభజన నిర్ణయం వెలువడిన నాటినుంచి బార్ అసోసియేషన్ సభ్యులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గుమ్మంపాడు సర్పంచ్ పెనుమత్స రామరాజు సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. రామరాజును తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యమందిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో 38 రోజులుగా సాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. పెనుకొండ కొండపైకి వెళ్లే మార్గంలో వివిధ రకాలయిన విత్తనాలు నాటి సమైక్యవాదులు నిరసన తెలిపారు. వివిధ శాఖలకు చెందిన ఉపాధ్యాయులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన వెనక్కు వెళ్లే వరకు శాంతియుత మార్గాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ యువనేత కరణం వెంకటేష్ చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఆయన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, నిరవధిక దీక్షలు కొనసాగుతున్నాయి.