: అన్నీ పరిశీలించిన తరువాతే ఎపీఎన్జీవోలకు అనుమతి: అనురాగ్ శర్మ
అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అనుమతి ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. సభల నిర్వహణ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇతర సంఘాలు కూడా అనుమతి కోరాయని, కానీ, అదే రోజున కావడంతో అనుమతి ఇవ్వలేకపోయామని అన్నారు. 19 షరతులతో సభకు అనుమతి ఇచ్చామని చెప్పిన కమిషనర్, ఐడెంటిటీ కార్డులు ఉన్నవారినే అనుమతిస్తామని చెప్పారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఉద్యోగులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై కూడా ఉందని గుర్తుచేశారు. శాంతి సామరస్యాలతో సభను నిర్వహించుకోవాలని ఏపీఎన్జీవోలకు అనురాగ్ శర్మ తెలిపారు.