: చంద్రబాబు కాక్ టెయిల్ వద్దన్నవేళ..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ పక్కాగా పాటించే వ్యక్తని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఆరోగ్యపరంగా ఎన్నో నియమాలు పాటిస్తారాయన. మరోవైపు, నైతికతకూ పెద్దపీట వేస్తారు. ఎంతలా అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ నే అబ్బురపరిచేంత! గుంటూరు జిల్లా మోతడకలో చలపతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన టీచర్స్ డే కార్యక్రమంలో బాబు విద్యార్థులతో ఈ విషయాలను పంచుకున్నారు. వివరాల్లోకెళితే.. బాబు సీఎంగా వ్యవహరించిన సమయంలో ఓసారి బిల్ క్లింటన్ భారత పర్యటనకు విచ్చేశారు. అప్పుడు ఢిల్లీలో క్లింటన్ తో సమావేశానికి బాబుకు కూడా ఆహ్వానం అందింది.
అమెరికా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు క్లింటన్ తో భేటీ మంచి చాన్సని భావించిన బాబు అందుకోసం తానెంతో కసరత్తు చేశానని చెప్పారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రూపకల్పన చేశానని తెలిపారు. అనుకున్న సమయానికి ఢిల్లీ వెళ్ళి క్లింటన్ ను కలిశానని, అయితే ఆయన ఫార్మాలిటీ కోసం కాక్ టెయిల్ పార్టీకి పిలిచారని బాబు వెల్లడించారు. తాను పార్టీకి వెళ్ళి తాగకుండా ఉన్నా, తాగినట్టే ప్రచారం జరుగుతుందని, అందుకే ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించానని బాబు గుర్తు చేసుకున్నారు. అయితే, ఓ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండని క్లింటన్ ను కోరానని, అందుకు ఆయన సరే అన్నారని చెప్పుకొచ్చారు.
ఆ రెండు నిమిషాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపానని, అందుకు అచ్చెరువొందిన క్లింటన్ ఆ స్వల్పకాలిక భేటీని 42 నిమిషాలకు పొడిగించారని బాబు తెలిపారు. ఆ భేటీ ఫలితమే మైక్రోసాఫ్ట్ తన ఆర్ అండ్ డి సెంటర్ ను తొలిసారి అమెరికా వెలుపల హైదరాబాదులో ఏర్పాటు చేసిందని, అక్కడి నుంచి పలు ప్రముఖ ఐటీ సంస్థలు హైదరాబాదు బాట పట్టాయని టీడీపీ అధినేత వివరించారు.