: సిరియాపై యుద్ధ మేఘాలు.. పెరిగిన క్రూడాయిల్ ధర
సిరియాపై పాక్షిక యుద్ధానికి అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలపడంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. 90 రోజులపాటు వాయుమార్గంలో నిర్ధేశిత లక్ష్యాలపై దాడులకు ఉద్దేశించిన తీర్మానాన్ని సెనేట్ కమిటీ ఓకే చేసింది. దీంతో సిరియాపై యుద్ధానికి దిగాలన్న ఒబామా ఆకాంక్షకు బలం చేకూరింది. సొంత పౌరులపై రసాయనిక దాడి చేసి ప్రాణాలు పోవడానికి కారణమైన సిరియా ప్రభుత్వానికి యుద్ధం ద్వారా బుద్ధి చెప్పాలని ఒబామా భావిస్తున్నారు.
దేశాల మధ్య యుద్ధ సమయాల్లోనూ రసాయనిక ఆయుధాల ప్రయోగాన్ని ప్రపంచంలో 98 శాతం దేశాలు నిషేధిస్తున్న నేపథ్యంలో సిరియా ప్రభుత్వం రసాయనిక ఆయుధాలను వినియోగించడం క్షమించరానిదని ఒబామా ఇప్పటికే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెనేట్ మద్దతుతో ఆయన సిరియాపై యుద్ధానికి దిగాలని యోచిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా, ఆసియా ప్రాంతంలో ముడి చమురు ధరలు పెరిగాయి. న్యూయార్క్ లో క్రూడాయిల్ 115 డాలర్లకు చేరుకుంది.
అయితే, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా బయటపడలేదు. ఈ సమయంలో అమెరికా సైనిక చర్య భారత్ లాంటి వర్ధమాన దేశాలకు ప్రతికూలంగా మారనుంది. క్రూడాయిల్ ధర పెరిగితే మన కరెంటు ఖాతాలోటు బాగా పెరుగుతుంది. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇప్పటికే తరిగిపోయిన రూపాయి విలువతో మనం ఎంతో సతమతమవుతున్నాం.