: ఎముకల బలానికి పుట్టగొడుగులు
ఎముకలు బలంగా ఉండాలంటే... డి విటమిన్ పుష్కలంగా తీసుకోవాలి. ఈ 'డి' విటమిన్ చాలా తక్కువ ఆహార పదార్ధాల్లో లభిస్తుంది. మనకు చాలినంత డి విటమిన్ లభించాలంటే చక్కగా పుట్టగొడుగులు తీసుకుంటే చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే డి విటమిన్ లోపంతో బాధపడేవారు పుట్టగొడుగులను తీసుకుంటే మేలని చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెడికల్ స్కూల్ ఫిజియాలజీకి చెందిన శాస్త్రవేత్తలు పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటున్నట్టు గుర్తించారు. మనిషి రోజంతా చాలా చురుగ్గా ఉండడానికి పది మైక్రోగ్రాముల డి విటమిన్ అవసరమని, ఈమేర డి విటమిన్ మూడు, నాలుగు పుట్టగొడుగుల్లో లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు మూడు లేదా నాలుగు పుట్టగొడుగులను ఆహారంలో తీసుకుంటే మనకు చాలినంత డి విటమిన్ లభిస్తుందని, ఎముకల ఆరోగ్యానికి డి విటమిన్ ఎంతగానో తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయం గురించి సిడ్నీ మెడికల్ స్కూల్ ఫిజియాలజీ విభాగాధిపతి రెబెక్కా మాసన్ మాట్లాడుతూ మనిషి రోజంతా చురుగ్గా ఉండడానికి పది మైక్రోగ్రాముల డి విటమిన్ సరిపోతుందని, కాబట్టి రోజుకు మూడు లేదా నాలుగు పుట్టగొడుగులను ఆహారంలో ఉండేలా చూసుకుంటే మేలని చెబుతున్నారు.