: దీన్ని తొలగిస్తే హైబీపీ తగ్గుతుందట


హైబీపీ ఉన్నవారికి ఒక కొత్తరకం చికిత్సను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో ఒక చిన్న బియ్యపుగింజంత పరిమాణంలో ఉండే కెరోటిడ్‌ బాడీని తొలగిస్తే చక్కగా అధిక రక్తపోటును తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము కనుగొన్న ఈ కొత్త రకం చికిత్స హైబీపీకి సంబంధించిన చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో హైబీపీని తగ్గించడానికి ఒక కొత్త పద్ధతిని కనుగొన్నారు. మెడకు రెండు పక్కల నుండి మెదడుకు రక్తాన్ని మోసుకెళ్లే పెద్ద ధమని వద్ద బియ్యపుగింజంత పరిమాణంలో ఉండే కెరొటిడ్‌ బాడీని తొలగిస్తే రక్తపోటు తగ్గుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక రక్తపోటు ఉన్న ఎలుకలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. మెదడుకూ కెరొటిడ్‌ బాడీకి మధ్య అనుసంధానాన్ని తొలగిస్తే రక్తపోటు పడిపోవడమే కాదు... సాధారణ స్థాయిలో కొనసాగుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయం గురించి బ్రిస్టల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిజియాలజీ అండ్‌ ఫార్మకాలజీకి చెందిన ప్రొఫెసర్‌ జులియన్‌ ప్యాటాన్‌ మాట్లాడుతూ రక్తపోటు ఎక్కువగా ఉన్పప్పుడు కెరొటిడ్‌ బాడీ విభిన్నంగా ప్రవర్తిస్తుందని తెలుసు. కానీ అధిక రక్తపోటుకు ఇది గణనీయంగా దోహదం చేస్తుందని తెలియనే తెలియదని, తాము కనుగొన్న ఈ విషయం చాలా ఆసక్తికరమైన అంశమని అన్నారు.

సాధారణంగా కెరొటిడ్‌ బాడీ రక్తంలో ఆక్సిజన్‌, కార్బన్‌డయాక్సైడ్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయినప్పుడు ప్రేరేపితమవుతుంది. ఆక్సిజన్‌ సాధారణ స్థాయికి చేరుకునేంతవరకూ శ్వాస వేగంగా తీసుకునేలా ఇది చేస్తుంది. కెరొటిడ్‌ బాడీకి మెదడుకు మధ్య నాడీ అనుసంధానం ద్వారా ఈ ప్రతిస్పందన జరుగుతుంది. ఈ ఫలితాల ఆధారంగా శాస్త్రవేత్తలు మనుషులపై ప్రయోగ పరీక్షలు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడికావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News