: ఏపీఎన్జీవోల సభ జరుపుకోనిద్దాం: జానారెడ్డి
ఏపీఎన్జీవోల సభకు పోటీగా శాంతి ర్యాలీ చేపట్టవద్దని తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి జానా రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీలకు అనుమతి రాదనుకున్నానన్నారు. అయితే 7వ తేదీ సభకు ఏ పరిస్థితుల్లో అనుమతిచ్చారో తెలుసుకుంటామని జానా తెలిపారు. ఇరు ప్రాంతాల వారికి అనుమతి ఇవ్వకపోవడం సబబని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని జానారెడ్డి అన్నారు.
సభలు, సమావేశాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చిన తరువాతే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. కొన్ని పార్టీల ద్వంద్వ వైఖరి బాధ కలిగిస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు నెల రోజులుగా సమ్మె చేయడం దురదృష్టకరమని, రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలని జానారెడ్డి కోరారు.