: కష్టకాలంలో రిజర్వ్ బ్యాంకు పగ్గాలు చేపట్టిన రఘురామ్
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ గవర్నర్ గా రఘురామ్ రాజన్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2008 ఆర్థిక సంక్షోభ సమయం నుంచీ రిజర్వ్ బ్యాంకు బాధ్యతలు చూసిన దువ్వూరి సుబ్బారావు పదవీకాలం నేటితో ముగిసిపోయింది. రఘురామ్ రాజన్ ముందు ఎన్నో సవాళ్లు, సంక్లిష్టతలు ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ఠస్థాయి (68)కి దిగజారింది. 9 శాతం వృద్ధికి చేరుకున్న దేశ జీడీపీ 4.4 శాతానికి దిగి వచ్చింది. అంటే పదిహేనేళ్ల క్రితంనాటి స్థితికి చేరింది. కరెంటు ఖాతా లోటు హెచ్చుస్థాయిలో కొనసాగుతోంది. వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నాయి. రుణాల లభ్యత తక్కువగా ఉంది. ఈ పరిస్థితులను చక్కదిద్దటం అనేది ఆషామాషీ కాదు. అంత సులభమూ కాదు. అయితే, ఐఎంఎఫ్ కు లోగడ ముఖ్య ఆర్థికవేత్తగా రఘురామ్ సేవలు అందించారు. ఆ అనుభవంతో ఆయన పరిస్థితులను కొంతవరకు చక్కదిద్దగలరనే ఆశాభావం వ్యక్తమవుతోంది.