: బెంగళూరు నగర ప్రజలను వణికిస్తున్న సైకో శంకర్


మూడు రోజులుగా బెంగళూరు నగర మహిళలకు కంటిమీద కునుకు కరవైంది. ముఖ్యంగా జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలలో ఉండే వారు 'సైకో శంకర్' భయంతో వణికిపోతున్నారు. మహిళల రక్షణ కోసం మగవారు అప్రమత్తంగా ఉంటున్నారు. బెంగళూరు కేంద్ర కారాగారం నుంచి సీరియల్ రేపిస్ట్ సైకో శంకర్ ఆదివారం ఉదయం పరారయ్యాడు. మూడు రోజులైనా పోలీసులు అతడి జాడను కనిపెట్టలేకపోయారు. దీంతో మళ్లీ అతడు ఎక్కడ ఏ మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తాడోనన్న భయం పోలీసులను సైతం నిద్రపోనీయడం లేదు.

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు సైకో శంకర్ పేరు చెబితే చాలు ఉలిక్కిపడతారు. అతడి నేర చరిత్ర అంత భయంకరం. ఇతడిపై ఎన్నో అత్యాచారాలు, హత్యకేసులున్నాయి. 36 ఏళ్ల జైశంకర్ ఒంటరిగా మహిళ కనిపిస్తే శారీరకంగా హింసించి ఆపై అత్యాచారం చేస్తాడు. అడ్డగిస్తే వారి ప్రాణాన్ని తన దగ్గరున్న పదునైన ఆయుధంతో క్షణాల్లో తీసేస్తాడు. ఇందుకోసమే ఆయుధాలతో ఒక నల్లటి చేతిసంచి కూడా అతడి దగ్గర ఉంచుకుంటాడు.

వ్యభిచార కేంద్రాలకు వెళ్లడం అక్కడ వేశ్యలతో గడిపిన తర్వాత వారిని అంతమొందించడం అతడికి అలవాటు. ఫామ్ హౌస్ లలో ఉండే ఆడవారిని టార్గెట్ చేసుకుంటాడు. అంతేకాదు మారుమూల గ్రామాలలో కన్నుపడ్డ ఆడదానిని అపహరించి ఆపై అత్యాచారం చేసిన కేసులూ ఉన్నాయి. ఇతడిపై 12 అత్యాచారం, హత్య కేసులున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అదనంగా 7 అత్యాచార కేసులను కూడా ఇతడు ఎదుర్కొంటున్నాడు. 2011 మే 5న శంకర్ బీజాపూర్ జిల్లా జల్కి చెక్ పోస్ట్ వద్ద పట్టుబడడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మూడు రోజుల కిందట సైకో శంకర్ మళ్లీ తప్పించుకున్నాడన్న వార్తలతో ప్రజలు వణికిపోతున్నారు. బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సైకో శంకర్ కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News