: విశాఖలో కివీల పరుగుల వెల్లువ
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్-ఎ లోయరార్డర్ బ్యాట్స్ మెన్ కూడా బ్యాట్లు ఝుళిపించారు. డౌగ్ బ్రేస్వెల్ (96), సోధీ (57) హాఫ్ సెంచరీలతో భారత్-ఎ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దీంతో, తొలి ఇన్నింగ్స్ లో కివీలు 437 పరుగుల భారీ స్కోరు సాధించారు. రెండో రోజు ఉదయం ఓవర్ నైట్ స్కోరు 300/8తో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్-ఎ జట్టు.. బ్రేస్వెల్, సోధీ తొమ్మిదో వికెట్ కు 162 పరుగులు జోడించడంతో భారీస్కోరు నమోదు చేయగలిగింది. తొలిరోజు ఆటలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ కోరీ (100), డెవ్ సిచ్ (115) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బదులిచ్చేందుకు బరిలో దిగిన భారత్-ఏ నేడు ఆటముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న సారథి విజయ్ జోల్ 2 పరుగులకే వెనుదిరిగాడు. ఓపెనర్ జగదీశ్ (40 బ్యాటింగ్), జునేజా (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆటకు మరో రెండ్రోజుల సమయం మిగిలి ఉంది.