: 24 గంటల్లో యూపీలో మూడు అత్యాచార కేసులు
ఉత్తర భారతం అత్యాచారాలకు నెలవుగా మారుతోంది. గంటల తేడాతోనే ప్రతిరోజూ మహిళలపై కామాంధుల అకృత్యాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇవన్నీ చాటుమాటున జరిగిపోతున్నా.. అరికట్టడంలో ప్రభుత్వం, స్పందించడంలో సమాజం చాలా వెనకబడిందనే చెప్పాలి. తాజాగా, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 24 గంటల్లో మూడు అత్యాచార కేసులు నమోదయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. 28 సంవత్సరాల వివాహితపై ఇంటిపక్కన ఉండే రఘురాజ్ అనే వ్యక్తి, మరో ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. వెంటనే అతన్ని అరెస్టు చేశామని, మిగతా ఇద్దరికోసం గాలిస్తున్నామన్నారు.
ఇక శంకరన్ ప్రాంతంలోని అచెలాల్ గ్రామంలో 26 సంవత్సరాల మహిళ బయటికి వెళుతున్న సమయంలో మరో అత్యాచారం జరిగిందన్నారు. ఇదే ప్రాంతంలోని నకేలా గ్రామంలో 30 సంవత్సరాల మహిళపై దారుణం జరిగినట్లు వివరించారు. విచిత్రమేమిటంటే ఈ మూడు ఘటనలు సోమవారమే జరిగాయని, ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.