: 'జంజీర్' విడుదలకు తొలగిన అడ్డంకులు
అలనాటి హిట్ చిత్రం 'జంజీర్' ను రీమేక్ చేసి అదే పేరుతో ఈనెల 6న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటించిన ఈ ద్విభాషా చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహించారు. అయితే, పాత జంజీర్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు, కథకు సంబంధించిన కాపీరైట్లు తమవద్ద ఉన్నాయని బాలీవుడ్ స్టోరీ రైటర్లు సలీమ్ ఖాన్, జావేద్ అక్తర్ లు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు కొత్త జంజీర్ చిత్ర నిర్మాతలు మెహ్రా సోదరులనుంచి రూ.6 కోట్ల పరిహారం ఇప్పించాలని కూడా వారు తమ పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్లు చాలా ఆలస్యంగా స్పందించారని పేర్కొంటూ, తర్వాతి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా, జంజీర్ సినిమా తెలుగులో 'తుఫాన్' పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే.