: ప్రజలపై విసరడానికి మొయిలీ పెట్రో బాంబులు!
డీజిల్, వంటగ్యాస్, కిరోసిన్ ధరలను ఎలా మండించాలో ఆ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రధాని మన్మోహన్ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. అవేంటంటే.. 'డీజిల్ లీటర్ పై 5 రూపాయలను వెంటనే పెంచాలి. ఆ తర్వాత వారానికో సారి 50 పైసలు చొప్పున పెంచుతూ పోవాలి. వంటగ్యాస్ సిలిండర్ పై తక్షణం 50 రూపాయలు పెంచాలి. ఆ తర్వాత నెలనెలా 50 రూపాయలు వడ్డిస్తూ వెళ్లాలి. కిరోసిన్ ధరను లీటర్ కు ఇప్పటికిప్పుడు 2 రూపాయలు పెంచాలి'.. ఇవండీ మొయిలీ మహాశయుడు ప్రజలపై విసరడానికి సిద్ధం చేస్తున్న బాంబుల వివరాలు!
ప్రస్తుతం పెట్రోల్ ధరలను మాత్రమే సవరించే అధికారం ఆయిల్ కంపెనీలకు ఉంది. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరలపై మాత్రం ప్రభుత్వం నియంత్రణ కొనసాగుతోంది. సామాన్యులు, నిత్యావసరాల ధరలతో ముడిపడి ఉండడం వల్ల వీటిపై ప్రభుత్వం సబ్సీడీ భరిస్తోంది. డీజిల్ ధరలపై కూడా నియంత్రణ ఎత్తివేసే చర్యల్లో భాగంగా నెలనెలా 50 పైసలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ, రూపాయి మారకం విలువ దారుణంగా తగ్గిపోవడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచాలని పెట్రోలియం శాఖ ఒత్తిడి తీసుకువస్తోంది.
ఇక మొయిలీ చెప్పిన మరో ప్రతిపాదన ప్రకారం రెండు వారాలకోసారి లీటర్ డీజిల్ పై 50 పైసలు పెంచుకోవడం, లేదా నెలనెలా 50 పైసలకు బదులుగా 90 పైసలు పెంచుకునేందుకు అనుమతించాలని మొయిలీ కోరారు. దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి.