: క్షయవ్యాధిని చక్కగా నిర్మూలించవచ్చు
క్షయవ్యాధి ప్రాణాంతక వ్యాధి. దీన్ని నివారించేందుకు పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. క్షయ వ్యాధిని నివారించేందుకు ఉపయోగించే మందులను, అటు బ్యాక్టీరియా కూడా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిపోతోంది. దీంతో శాస్త్రవేత్తలకు ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం అనేది పెద్ద సమస్యగా మారింది. మందులను తట్టుకుని ఈ బ్యాక్టీరియా ఎలా నిలబడగలుగుతోంది? అనే విషయంపై తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో, ఈ బ్యాక్టీరియాలో 39 కొత్త జన్యువులు ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు సరికొత్త ఔషధాలను తయారు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు క్షయ వ్యాధికి సంబంధించిన బ్యాక్టీరియా మొత్తం జీనోమ్ సీక్వెన్స్‌లను విశ్లేషించే కొత్త పద్ధతిలో ప్రపంచ వ్యాప్తంగా ఆసుపత్రులనుండి సేకరించిన భారీ జన్యు రకాలను విశ్లేషించగా, ఔషధ నిరోధక క్షయకు సంబంధించి 39 కొత్త జన్యువులకు సంబంధం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో శాస్త్రవేత్తలు భావించిన దానికన్నా కూడా ఎక్కువ జన్యువులు ఈ వ్యాధి నిరోధకతలో పనిచేస్తున్నట్టు తాము గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు. చాలా ఏళ్లుగా ప్రాణాంతక బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌కు చెందిన రకాలు ఔషధాలకు మరింతగా నిరోధకతను పెంచుకుంటుండడంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైద్యులకు పెద్ద సమస్యగా మారింది. ఇలా క్షయ నిరోధక ఔషధాలకు ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా తట్టుకుని నిలబడుతుండడానికి తోడ్పడుతున్న ఉత్పరివర్తనాలను గురించి చాలా దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉన్నారు.
కొత్త ఔషధాల అభివృద్ధికి తోడ్పాటునిస్తూ, ఔషధ నిరోధక క్షయ నిర్ధారణలో జన్యు మార్కర్ల తోడ్పాటునిచ్చినా బ్యాక్టీరియా రకాలు వేగంగా ఉత్పరివర్తనం చెందుతుండడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. తాజాగా ఔషధ నిరోధక క్షయలో ఉన్న కొత్త జన్యువులను గుర్తించడంతో ఈ వ్యాధిని నివారించేందుకు సరికొత్త ఔషధాలను తయారు చేసేందుకు మరో మార్గం దొరికినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో భావించిన దానికన్నా కూడా ఎక్కువ జన్యువులు ఔషధ నిరోధక క్షయలో పనిచేస్తున్నట్టు తాము గుర్తించామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మెగాన్ ముర్రే చెబుతున్నారు. ఈ అధ్యయనంతో నిరోధక జన్యువులనే లక్ష్యంగా చేసుకుని ఔషధాలను తయారు చేయడానికి అవకాశాలు మెరుగవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.