: విశాఖలో కివీల శతక విహారం
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో న్యూజిలాండ్-ఎ ఆటగాళ్ళు కోరీ ఆండర్సన్ (100), ఆంటన్ డెవ్ సిచ్ (115) వీరోచిత శతకాలతో జట్టును ఆదుకున్నారు. ఇక్కడి పోర్టు ట్రస్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో నేడు మొదలైన ఈ నాలుగు రోజుల మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత బౌలర్ల ధాటికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడిన న్యూజిలాండ్-ఎ జట్టును కోరీ, ఆంటన్ సురక్షిత స్థితికి చేర్చారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 165 పరుగులు జోడించడం విశేషం. దీంతో, కివీస్ తొలి రోజు ఆటముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ధవళ్ కులకర్ణి, జలజ్ సక్సేనా చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య విశాఖలోనే జరిగిన తొలి అనధికార టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.