: దేశంలో మూడింట ఒకవంతు ఎంపీ, ఎమ్మెల్యేలపై నేరారోపణలు
దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో మూడింట ఒకవంతు మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన ఓ స్వచ్చంద సంస్థ పేర్కొంది. ఈ మేరకు 'అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్'(ఏడీఆర్) సంస్థ ఓ జాతీయ వ్యాప్త సర్వే నిర్వహించింది. నవంబర్ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేసిన ఈ సర్వేలో పలు విషయాలను వెల్లడించింది. 2004 లోక్ సభ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేసిన 62,847 మంది అభ్యర్ధులను సర్వే కోసం ఎంచుకుంది. వారిలో 11,063 (18 శాతం) అభ్యర్ధులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 5,253 (8 శాతం) అభ్యర్ధులు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు బయటిపడింది.
ఇక ప్రస్తుత లోక్ సభలోని 543 మంది ఎంపీల్లో 162 మందిపై నేరారోపణలు ఉండగా, 76 మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని వెల్లడించింది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. దేశంలోని 31 శాతం (1,258) మందిపై క్రిమినల్ ఆరోపణలు ఉన్నాయని, కేవలం 12 శాతం మంది అభ్యర్ధులే ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉన్నారని ఏడీఆర్ విశ్లేషణ తెలిపింది.