: ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగింది: బాబు


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి అంతా టీడీపీ అధికారంలో ఉండగానే జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ను దోచుకున్నవారంతా చంచల్ గూడ జైలులో ఉన్నారని అన్నారు. రాజ్యసభ, లోక్ సభల్లో తమ ఎంపీల పోరాటం బాగుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ఓ ముద్దపప్పని, అలాంటి వ్యక్తిని దేశానికి ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు. సీమాంధ్రలో రగులుతున్న ఉద్యమం కేంద్రానికి కనబడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

సమైక్యాంధ్ర మీద ప్రేమ ఉంటే టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటంలో పదో వంతు పోరాటం కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలుగు జాతితో పెట్టుకున్న ఎవరూ ఇంతవరకు బాగుపడ్డట్టు చరిత్ర చెప్పడం లేదని ఆయన అన్నారు. మాటతప్పం, మడమ తిప్పం అన్నవాళ్లు జగన్ బెయిలు కోసం సోనియా కాళ్ల దగ్గర పడ్డారని వైఎస్సార్సీపీని దుయ్యబట్టారు. దోచుకున్నవారి నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News