: భారతీయుల ఊపిరితిత్తులు బలహీనమైనవి
భారత దేశపు నగరాలలో ఎంతటి విపరీతమైన కాలుష్యం ప్రబలుతున్నదో తెలియజేసే మరో హెచ్చరిక ఇది! మనదేశంలో ప్రజల ఊపరితిత్తులు, యూరోపియన్ల ఊపిరితిత్తులతో పోల్చినప్పుడు 30 శాతం బలహీనమైనవని, పనితీరు తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం చెబుతోంది. భారతదేశంలో వాహన కాలుష్యం నియంత్రణ గురించి సరైన చర్యలు గనుక తీసుకోకుంటే ఈ పరిస్థితి మరింత దిగజారుతుందని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
జైపూర్, పూనే, హైదరాబాద్, కోల్‌కతా, కాశ్మీరు ప్రాంతాల్లోని ధూమపానం అలవాటులేని ఆరోగ్యంగా ఉన్న పదివేల మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. "మేం ఊపిరితిత్తుల పనితీరు గమనించేందుకు ప్రధానంగా పీక్ ఎక్స్‌పిరేటరీ ఫ్లో రేట్ ను పరిశీలించాం. దక్షిణ భారతీయులకంటె ఉత్తర భారతీయులు కొంత మెరుగ్గా ఉన్నారు. కానీ మొత్తంగా యూరోపియన్ల కంటె 30 శాతం తక్కువగా ఉంది." అని పూనే లోని చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ డైరక్టర్ డాక్టర్ సందీప్ సాల్వి చెప్పారు.
కెనడియన్ పరిశోధకులు ఇలాంటి పరిశోధననే భారత్ సహా 17 దేశాల్లో నిర్వహించారు. వీరి పరిశోధనలో కూడా భారతీయులు అత్యంత చెత్త ఊపిరితిత్తులను కలిగి ఉన్నట్లు తేలింది.