: అంగారకుడిపై కూడా సూర్యగ్రహణం
మన భూమికి చంద్రుడు ఉన్నట్లే.. అంగారక గ్రహానికి కూడా ఉన్న అనేకానేక ఉపగ్రహాల్లో ఫోబోస్ అనేది ఒకటి. చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనకు సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో.. అలాగే ఫోబోస్ ఉపగ్రహం సూర్యుడి అభిముఖంగా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అంగారక గ్రహం మీద కూడా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణం చుట్టూతా కథలను అల్లుకోవడానికి అక్కడ జీవజాలం ఉన్నదో లేదో ఇంకా తేలలేదు గానీ.. అంగారక గ్రహం మీద ప్రస్తుతం సంచరిస్తున్న క్యూరియాసిటీ పరిశోధక వాహనం.. ఆ సూర్యగ్రహణం ఫోటోలను తీసి భూమిమీదకు పంపింది.
అంగారక గ్రహం మీదనుంచి అతి దగ్గరగా హైరిజల్యూషన్‌తో ఈ క్యూరియాసిటీ తనలో ఉన్న 'మాస్ట్-క్యామ్' కెమెరాతో ఈ ఫోటోలను తీసిందిట. మరో సంగతి ఏంటంటే.. నాసా భూమి మీద నుంచి నియంత్రిస్తోంటే.. నడుస్తూ వచ్చిన ఈ క్యూరియాసిటీ.. ఇప్పుడు ఆటో నేవిగేషన్ అనే పద్ధతిలో.. తనంత తనే.. పరిసరాల్ని అంచనా వేసి.. నడిచే స్థితికి వచ్చిందిట. అంగారకునిపై పరిశోధనల్లో ఇది పురోగమనం అన్నమాట.