: సిక్కోలులో లక్షలాదిమందితో 176 కిలోమీటర్ల మానవహారం
ఉద్యమాల పురిటి గడ్డ సిక్కోలా? మజాకా? అనేలా సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడింది. లక్షలాది మంది ప్రజలు చిన్నాపెద్దా తేడా లేకుండా సుశిక్షితులైన సైనికుల్లా ఒకటి కాదు, రెండు కాదు, 176 కిలో మీటర్ల మానవహారం ఏర్పాటు చేశారు. అదీ శ్రీకాకుళం జిల్లా వాసుల ఉద్యమస్ఫూర్తి. ఈ రికార్డు స్థాయి మానవహారానికి జాతీయ రహదారికి ఇరువైపులా శ్రీకాకుళం నుంచి పైడిభీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, పలాస, సోంపేట, కంచిలి, మందస, ఇచ్ఛాపురం మండలాల మీదుగా జిల్లా పొడవునా ఉన్న ప్రజలు ఉదయం 8 గంటల నుంచే సన్నద్దమయ్యారు.
సరిగ్గా 11 గంటలకు ప్రపంచం నివ్వెరపోయేలా 176 కిలోమీటర్ల మేర లక్షా డెబ్బై ఐదు వేలమందికి పైగా ప్రజలు మానవహారం ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పారు. శ్రీకాకుళం జిల్లాలోని పెద్దపాడు వద్ద మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా పాలు పంచుకోవడం విశేషం. ఈ భారీ మానవహారంలో సామాన్యులు మొదలుకొని విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు, రేషన్ డీలర్లు, ఉపాధిహామీ కూలీలు, మహిళా మండళ్ల ప్రతినిధులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు పాల్గొన్నారు.