: ఆ మగాళ్లిద్దరూ కావాలంటున్న మహిళ!
నాకు నువ్వే కావాలి... అంటే నాకూ నువ్వే కావాలి... అంటూ ఇద్దరు పురుషులు ఒక మహిళను పెళ్లాడడానికి పోటీలు పడుతున్నారు. ఎదురు కట్నం ఇచ్చి మరీ ఆమెను మనువాడేందుకు సిద్ధపడుతున్నారు. ఈ వాగ్వాదం పెద్దది కావడంతో అది పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇద్దరు పురుషులు ఇలా వాదులాడుకోవడమేకాదు... వారిద్దరూ కూడా తనకు కావాలని సదరు మహిళ అనడం ఇక్కడ అందరినీ ఆశ్యర్యంలో పడేస్తోంది...
కెన్యాలో కవల పిల్లల తల్లి అయిన ఒక వితంతు మహిళను ఇద్దరు పురుషులు ఇష్టపడ్డారు. ఆమెతో నాలుగేళ్లకు పైగా ఇద్దరూ కూడా ప్రేమబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇద్దరి గురించి పరస్పరం తెలుసు. సదరు మహిళ కూడా ఇద్దరిపైనా ప్రేమ చూపుతూ వచ్చింది. అయితే నాలుగేళ్ల తమ ప్రేమబంధాన్ని వివాహంతో మరింత బలీయం చేసుకుందామని అనుకున్నారు. దీంతో చిక్కొచ్చి పడింది. సదరు మహిళను వివాహం చేసుకోవడానికి నేనంటే నేనంటూ ఇద్దరూ పోటీలు పడుతున్నారు. సిల్వెస్టర్ వెన్‌డ్వా, ఎలిజహ్ కిమానీ ఇద్దరూ కూడా సదరు మహిళను పెళ్లాడతామంటూ ముందుకొస్తున్నారు. నాలుగేళ్లపాటు ఒకరి విషయాల్లో ఒకరు తలదూర్చకూడదని ఒప్పందం చేసుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని సజావుగా సాగించిన ఈ ముగ్గురు వివాహం విషయానికి వచ్చేసరికి గొడవకు దిగారు. చివరికి పోలీసుల వద్దకు వచ్చారు.
అయితే ఇప్పటి వరకూ ఒక మహిళకోసం ఇద్దరు పురుషులు కొట్టుకోవడాన్ని తాను ఎక్కడా చూడలేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెన్యాలో బహుభార్యత్వం (పాలిగమి) నేరం కాదు. అయితే ఒక మహిళ ఎక్కువమంది భర్తలను కలిగి వుండడం (పాలియాండ్రి) గురించి వినడం ఇదే మొదటిసారి అని కెన్యా న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే పాలియాండ్రి అనేది చట్ట విరుద్ధమని ఎక్కడా లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు చూస్తే ఇద్దరూ కూడా తమకు ఆమె కావాలంటుండగా... ఆమెకూడా ఆ ఇద్దరూ కూడా తనకు కావాలంటోంది. మరి ఈ కేసు ఎలా పరిష్కారం అవుతుందో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.