: సంపదకు సామర్థ్యానికి లింకు ఉంది!
కాలే కడుపులోనే పుట్టెడు ఆలోచనలు పుడుతాయని, కడుపు నిండినాక సేదతీరడమే ఉంటుంది తప్ప.. ఆలోచన సాగదని మనం అనుకోవచ్చు గాక. కానీ.. పేదరికంలో కునారిల్లుతున్న వారికి మేథస్సు కూడా మసకబారిపోతుందని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది. ఆర్థిక ఒత్తిడి వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయని, నిద్రలేని రాత్రులు గడపడం తప్ప మరో ప్రయోజనం ఉండదని, ఈ పరిశోధన తేల్చినట్లు అంతర్జాతీయ పరిశోధక బృందం చెబుతోంది.
అయితే ఇది పేదరికం గురించిన పరిశోధన మాత్రం కాదుట. అనుకున్న లక్ష్యాలను అందుకోవడానికి ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారో చెప్పేది మాత్రమేనట. హార్వర్డ్ పరిశోధక బృందం సభ్యుడు ముల్లైనాధన్ ఈ విషయం వెల్లడించారు. గడువు దాటిన చెల్లింపులు, బాకీల గురించి ఆలోచించేవారు.. తమ మేథస్సును తగ్గించేసుకుంటున్నారట. వారి ఆలోచన వాటి మీదే స్తంభించి ఇబ్బంది పడుతున్నారని.. ఈ అధ్యయనం చెప్తోంది. వీరు న్యూజెర్సీలో 400 మంది కన్జ్యూమర్లు, భారత్లోని 464 మంది చెరకు రైతుల్ని పరిశీలించారు.
ఇక్కడ ట్రాజెడీ ఏంటంటే.. సంపన్నులకు పేదలకు ప్రతీకగా.. వారు న్యూజెర్సీలో ఓషాపింగ్ మాల్కి వచ్చేవారిని, రెండో వైపు భారతదేశంలోని రైతులను ఎంచుకోవడమే! భారతీయ రైతులు అంటే పేదరికానికి ప్రతీకలుగా ఓ స్టాండర్డ్ ఒపీనియన్ అమెరికాకు ఉన్నదన్నమాట.