: చెత్త ఆర్ధిక విధానాల వల్లే ప్రస్తుత కష్టాలు: దువ్వూరి
రూపాయి పతనంతో దేశంలో మొదలైన కష్టాలు, మార్కెట్ల వరుస నష్టాలు, బంగారం సహా ఇతర ధరలు పెరగడంపై త్వరలో వైదొలగుతున్న ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన చివరి ప్రసంగంలో తనదైన శైలిలో స్పందించారు. ఆర్ధిక విధానాలు, రూపాయి పతనాన్ని కట్టడి చేయకుండా ప్రభుత్వ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుండటాన్ని దువ్వూరి ఎండగట్టారు. సర్కారు అసంబద్దమైన ఆర్ధిక విధానాల వల్లే ప్రస్తుత పరిస్ధితులని విమర్శించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటనల వల్లే రూపాయి కుప్పకూలిందంటూ తప్పంతా దానిపైనే నెట్టడంవల్ల దేశాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందన్నారు.
దేశీయంగా వ్యవస్థాగత అంశాలే రూపాయి క్షీణతకు మూల కారణమని చెప్పారు. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) అదుపు చేయలేని స్థాయికి పెరిగిపోవడమే రూపాయి భారీగా పతనమవడానికి ప్రధాన కారణమన్నారు. 'క్యాడ్' ను కట్టడి చేస్తే రూపాయి పరిస్థితి చక్కబడేదన్నారు. అయితే, ఈ ప్రక్రియ ప్రభుత్వం నుంచి వ్యవస్థాగతమైన చర్యలతో జరగాల్సిందే తప్ప ఆర్ బీఐ ఏమీ చేయలేదన్నారు.
ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి పి.చిదంబరంపై విమర్శలు చేసిన దువ్వూరి.. రిజర్వ్ బ్యాంకు ఉండటంవల్లే దేశం ఇలా అయినా ఉందని ఆయన స్వయంగా ఒప్పుకునే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.